నేను కాదు... కేటీఆర్‌ బాధ్యత వహించాలి: బండి

March 25, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నేడు బిజెపి అధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ‘మా నౌకరీలు మాగ్గావాలే’ పేరుతో జరిగిన దీక్షలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఖచ్చితంగా మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందనే నేను భావిస్తున్నాను. ఈ వ్యవహారంలో కేవలం ఇద్దరే ఉన్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పుడు 10-12 మందిని అరెస్ట్ చేశారు. అంటే అర్ధం ఏమిటి?

ఈ స్కామ్‌ గురించి కేటీఆర్‌ మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంత జరిగినా సిఎం కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు?సిట్‌ దర్యాప్తు పేరుతో నాకు నోటీస్ ఇవ్వడం కాదు. కేటీఆర్‌ని పిలిచి ప్రశ్నించాలి. కానీ సిట్‌ అధికారులకి అంత ధైర్యం లేక మాకు నోటీసులు ఇస్తున్నారు. సిట్‌ నోటీస్ ఇస్తే భయపడేది లేదు. నిన్న విచారణకు హాజరుకాలేకపోవడంతో నేనే వారికి ఫోన్‌ చేసి నోటీస్ తీసుకొన్నాను. అయినా సిట్‌ దర్యాప్తులు ఎందుకు వేస్తారో వాటిని తర్వాత ఏవిదంగా అటకెక్కించేస్తారో అందరికీ తెలుసు. నయీం కేసు, టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసులపై సిట్‌ ఏం దర్యాప్తు చేసింది? ఎవరిని అరెస్ట్ చేసింది?ఈ కేసులో పెద్ద వాళ్ళని తప్పించేసి చిన్నవాళ్ళను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. దీనికి కేటీఆర్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించాలి. పరీక్షలు వ్రాసి నష్టపోయిన యువత ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు భృతి ఇవ్వాలి. 

నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాము. దీని వెనుకున్నవారి మెడలువంచి మీ అందరికీ న్యాయం జరిపించేవరకు మా పోరాటం ఆగదు,” అని బండి సంజయ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Related Post