ఏకరాకు 10వేలు... గంటలో నిధులు మంజూరు చేస్తా!

March 23, 2023


img

సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబాద్ జిల్లాలలో వడగళ్ళవానకు దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బోనకల్, గార్లపాడు పరిసర గ్రామాలలో ఏరియల్ సర్వే ద్వారా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గార్లపాడులో రైతులకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకు రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు. తాను హైదరాబాద్‌ చేరుకొనేలోగానే నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ వడగళ్ళవానకు రాష్ట్రంలో 2.22,250 ఎకరాలలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు తనకు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా గోడకి చెప్పినా ఒకటేనని దాని నుంచి స్పందన రాదన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. కౌలు రైతులను కూడా తప్పక ఆదుకొంటామని  సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలలో కేసీఆర్‌ పర్యటించారు. తర్వాత మహబూబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలంలోని రెడ్డికుంట తండాలో పర్యటిస్తున్నారు. చివరిగా వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం, పరిసర గ్రామాలలో కేసీఆర్‌ పర్యటించనున్నారు. 

సిఎం కేసీఆర్‌తో పాటు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమారు, రైతు బంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఐ-సిపిఎం నేతలు, సిఎస్ శాంతికుమారి, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులున్నారు. 


Related Post