రేవంత్‌ రెడ్డి సిట్‌విచారణకు... కాంగ్రెస్‌ నేతల గృహనిర్బందం!

March 23, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై టి‌ఎల్ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై నేడు హైదరాబాద్‌లో హిమయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చి వివరణ, సాక్ష్యాధారాలను అందజేయాలని కోరుతూ సిట్ అధికారులు నోటీస్ ఇచ్చింది. కనుక పార్టీ శ్రేణులు సిట్ కార్యాలయానికి తరలివచ్చి తన పోరాటానికి సంఘీభావం తెలపాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 

ఒకవేళ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడకి చేరుకొంటే వారిని నియంత్రించడం కష్టం అవుతుందని భావిస్తున్న పోలీసులు, ఈరోజు ఉదయం నుంచే నగరంలోని కాంగ్రెస్‌ నేతలందరినీ గృహ నిర్బందం చేశారు. నగరంలో వివిద ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వెనక్కు తిప్పి పంపిస్తున్నారు. కాదని ముందుకు సాగాలనుకొనేవారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. 

టిఎస్‌పీఎస్సీలో అవినీతిని వ్యతిరేకిస్తూ నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే, నేతలను గృహ నిర్బందించడం ఏమిటని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తన ఇంట్లో కూర్చొని టీ తాగుతుండగా పోలీసులు వచ్చి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో ఆయన వారిపై ఆగ్రహించారు. భట్టి విక్రమార్క, మల్లు రవి, షబ్బీర్ అలీ తదితరులను పోలీసులు ఈరోజు గృహ నిర్బందంలో ఉంచారు. 

హిమాయత్ నగర్‌లో సిట్‌ కార్యాలయం వైపు వెళ్ళే అన్ని మార్గాల వద్ద భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులను తప్ప బయటవారెవరినీ సిట్‌ కార్యాలయంవైపు అనుమతించడం లేదు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు రేవంత్‌ రెడ్డి ఒక్కరే కారు దిగి సిట్ కార్యాలయంలోకి నడుచుకొంటూ వెళ్ళారు. టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో దోషులను పట్టుకోవలసిన పోలీసులు తమ నాయకుడికి నోటీస్ ఇచ్చి ప్రశ్నించడం ఏమిటని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. 


Related Post