సిఎం కేసీఆర్‌ నేడు జిల్లాల పర్యటన

March 23, 2023


img

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వడగళ్ళ వానలతో  రాష్ట్రంలో పలు జిల్లాలలో చేతికి అందివచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కనుక సిఎం కేసీఆర్‌ స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పేందుకు గురువారం జిల్లా పర్యటనలకు వెళుతున్నారు. 

ఈరోజు ఉదయం 10.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాకు చేరుకొంటారు. జిల్లాలో బోనకల్ మండలం రామాపురం గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలంలోని రెడ్డికుంట తండాలో పర్యటిస్తారు. 

మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలోని అడవి రంగాపురం గ్రామంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలంలోని లక్ష్మీపురం గ్రామం చేరుకొని అక్కడ పంట నష్టం పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి హైదరాబాద్‌ చేరుకొంటారు. 

వడగళ్ళ వానతో లక్షల ఎకరాలలో వరి, మొక్కజొన్న, ఇంకా పూలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పూతకు వచ్చిన మామిడి పిందెలన్నీ రాలిపోవడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వ్యవసాయ అధికారులు జిల్లాల వారీగా పంట నష్టం గురించి నివేదికలు తయారుచేసి సిఎం కేసీఆర్‌కు పంపించారు. కనుక నేడు స్వయంగా పరిశీలించిన తర్వాత రైతులకు పంట నష్టం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో జరిగిన ఈ పంటనష్టం గురించి వ్యవసాయశాఖ అధికారులు కేంద్రానికి కూడా నివేదిక పంపించిన్నట్లు సమాచారం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 


Related Post