కేసీఆర్‌ కుటుంబంలో మళ్ళీ రగడ?

February 04, 2023


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్యారావు శనివారం డిజిపి అంజని కుమార్‌ని కలవబోతే పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో ఆమె డిజిపి కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నాకి సిద్దం అవడంతో పోలీసులు ఆమెని లోనికి పంపించారు. ఆమె అంజని కుమార్‌ని కలిసి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రాత్రిపూట పోలీసులు జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో జొరబడి తన కుమారుడు రితీష్ రావుని పట్టుకుపోయారని ఆమె ఫిర్యాదు చేశారు. రాత్రిపూట మహిళా పోలీసులు లేకుండా తన ఇంట్లోకి ఎలా జొరబడ్డారని ఆమె డిజిపి అంజని కుమార్‌ని నిలదీశారు. పోలీసులు బలవంతంగా తన కుమారుడిని ఎక్కడకి పట్టుకుపోయారని, రెండు రోజులుగా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పమని జూబ్లీహిల్స్‌ పోలీసులని అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన కుమారుడిని విడిచిపెట్టాలని రమ్యారావు డిజిపి అంజని కుమార్‌ని డిమాండ్‌ చేశారు. 

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్‌ఎస్‌యుఐ)  నాయకుడైన రితీష్ రావుతో సహా పలువురు విద్యార్ధి సంఘం నేతలు రాష్ట్రంలో వివిడ సమస్యల పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీని ముట్టడించాలనుకొన్నారు. ఈవిషయం తెలుసుకొన్న పోలీసులు ముందస్తు జాగ్రత్తచర్యగా రితీష్ రావుతో సహా పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. అయితే పోలీసులు వారందరినీ ఎక్కడ ఉంచారో, ఎప్పుడు విడుదల చేస్తారో తెలపకపోవడంతో రమ్యారావు నేరుగా డిజిపి అంజని కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. 

సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కూతురే అయినా ఆమెకి, ఆమె కుమారుడికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post