వాణీ జయరాం అనుమానాస్పద మృతి?

February 04, 2023


img

ప్రముఖ నేపద్య గాయని వాణీ జయరాం (78) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో కన్ను మూశారు. అయితే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించిన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో పనిచేసే పనిమనిషి ఈరోజు ఉదయం ఆమె ఇంటి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా ఆమె తలుపు తీయకపోవడంతో వెంటనే వాణీ జయరాం బంధువులకి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించగా వాణీ జయరాం రక్తపు మడుగులో పడి ఉన్నారు. 

వారు వెంటనే హాస్పిటల్‌కి తరలించినప్పటికీ ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మొహం మీద బలమైన గాయం ఉండటం, రక్తపు మడుగులో పడి ఉండటంతో చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

వాణీ జయరాం భర్త 2018లో చనిపోయినప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వృద్ధాప్యం వలన ఆమె హాల్లో నడుస్తున్నప్పుడు మద్యలో ఉన్న టీపాయ్ మీద పడినప్పుడు తలకి బలమైన గాయమై స్పృహ తప్పి పడిపోతే తీవ్ర రక్తస్రావం అయ్యి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు కనుక ఎవరైనా డబ్బు, నగల కోసం ఆమెపై దాడి చేసి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, క్లూస్ టీం వాణీ జయరాం ఇంటిని స్వాధీనం చేసుకొని సాక్ష్యాధారాల కోసం గాలిస్తున్నారు. 

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 బాషల్లో 8,000కి పైగా పాటలు పాడి పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న వాణీ జయరాం మరణించారన్న వార్తే జీర్ణించుకోవడం కష్టంగా ఉంటే ఈవిదంగా మరణించడం ఇంకా బాధాకరమే.


Related Post