మంత్రులు కబుర్లు చెపుతారు తప్ప పనులు చేయరు: ఓవైసీ

February 04, 2023


img

ఈరోజు తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు, అనూహ్యంగా మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సిఎం కేసీఆర్‌ మీద, మంత్రుల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో సభలో ఉన్న మంత్రులు, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే, ఈరోజు ఉదయం సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, “ఆమె ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా?దానిలో ఆమె ఏవైనా మార్పులు, చేర్పులు సూచించారా?” అని నిలదీశారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ, “మంత్రివర్గంలో చర్చించిన ప్రతీ విషయాన్ని అందరికీ తెలియజేయవలసిన అవసరం లేదు,”అని ఘాటుగా జవాబిచ్చారు. 

అప్పుడు అక్బరుద్దీన్ స్పందిస్తూ, “మీ ఎమ్మెల్యేలకి టీవీ డిబేట్లలో పాల్గొనేందుకు టైమ్ ఉంటుంది కానీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు టైమ్ ఉండదా?చర్చా సమయంలో సభా నాయకుడు ఎక్కడ ఉన్నారు?శాసనసభలో మీరు చాలా కబుర్లు చెపుతుంటారు కానీ బయట మాత్రం పనులు జరుగవు. పాతబస్తీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభిస్తామని గత సమావేశాలలో చెప్పారు. కానీ ఇంతవరకు పనులు మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలుపెడతారు? ఉస్మానియా హాస్పిటల్‌ పరిస్థితి ఏమిటి? ఏవైనా సమస్యలు చెప్పుకొందామంటే మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు. మంత్రులు అందుబాటులో ఉండరు. పోనీ ఎవరైనా ఓ ప్యూన్ పేరు చెప్పండి. అతనికే మేము మా గోడు చెప్పుకొని వినతిపత్రాలు ఇస్తుంటాము,” అని అన్నారు. 

దీనిపై మంత్రి వేముల స్పందిస్తూ, “ఇదివరకు మీరు (అక్బరుద్దీన్) సభలో బాగానే మాట్లాడేవారు కదా?హటాత్తుగా మామీద ఇంత కోపం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది కనుక ముందు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “మీరు బీఏసీ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు? దానికి రాకుండా సభలో ఇటువంటి మాటలు మాట్లాడటం సరికాదు. మీకూ, సభానాయకుడికి ఏం సంబంధం?ఏవైనా సమస్యలుంటే సభ జరుగుతోంది కదా? చెప్పుకోండి. అంతేగానీ సంబందం లేని విషయాలు మాట్లాడొద్దు,” అని ఘాటుగా బదులిచ్చారు. 


Related Post