మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తులు లేవ్: ఇంద్రకరణ్ రెడ్డి

February 04, 2023


img

బిఆర్ఎస్‌ పార్టీ తొలిసారిగా రాష్ట్రం వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం బహిరంగసభ నిర్వహించబోతోంది. అయితే ఈ తొలి ప్రయోగానికి మహారాష్ట్ర ప్రజల నుంచి సరైన స్పందన రాకపోతే దేశ ప్రజలకి, ముఖ్యంగా బిఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలనుకొంటున్న పార్టీలకి తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక ఈ సభని ‘జాయినర్స్ మీటింగ్’ మాత్రమే బిఆర్ఎస్‌ చెప్పుకొంటోంది. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సహా పలువురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలలో పర్యటిస్తూ కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి మరాఠీ ప్రజలకి తెలియజేస్తూ, రేపు జరుగబోయే సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో రేపు జరుగబోయే సభలో తెలుస్తుంది. 

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సిఎం కేసీఆర్‌ రేపు (ఆదివారం) నాందేడ్‌లోని సచ్‌ఖండ్‌లోని గురుద్వారాని సందర్శిస్తారు. ఆ తర్వాత జాయినర్స్ సమావేశంలో ప్రసంగిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబై దేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకొంటాము. కానీ మహారాష్ట్రలో గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు భరోసా వంటి పధకాలు అమలుచేస్తున్నాము. కానీ మహారాష్ట్రలో ఇటువంటి పధకాలు లేవు. తెలంగాణలో సాధ్యమైనవి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు?తెలంగాణలో రైతులు ఏడాదికి మూడు పంటలు పండించే స్థాయికి చేరుకొంటే, మహారాష్ట్రలోని యావత్మల్‌లో రైతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే మహారాష్ట్రతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలని తెలంగాణలాగ అభివృద్ధి చేసేందుకు కేసీఆర్‌ నాయకత్వంలో బిఆర్ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తోంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (ఈసారి కేంద్రంలో రైతు ప్రభుత్వం) బిఆర్ఎస్‌ లక్ష్యం. ఇకపై మహారాష్ట్రలో జరిగే ప్రతీ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ కూడా పోటీ చేస్తుంది. బిఆర్ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోబోవడం లేదు,” అని చెప్పారు. 


Related Post