అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి!

January 28, 2023


img

నందమూరి తారక రామారావు మనుమడు, సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత  విషమంగా ఉందని బెంగళూరులోని నారాయణ హృదయాలయ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలియజేసింది. ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత నారా లోకేష్‌తో కలిసి శుక్రవారం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలో పీఎస్ఈ వైద్య కళాశాలలో చేర్పించి అత్యవసర చికిత్సలు చేశారు.

యాంజియో పరీక్షలో గుండెలోని ఎడమవైపు రక్తనాళాలలో 90 శాతంపై మూసుకుపోయిన్నట్లు తేలింది. చంద్రబాబు నాయుడు అభ్యర్ధన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయకి చెందిన వైద్య బృందం శుక్రవారం మధ్యాహ్నమే కుప్పం చేరుకొని అక్కడే అతనికి చికిత్స అందించారు. కానీ తారకరత్న పరిస్థితి అంతకంతకీ విషమిస్తుండటంతో అర్దరాత్రి అంబులెన్సులో బెంగళూరుకి తరలించారు.

కృత్రిమశ్వాస అందిస్తూ, బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి ఎక్మో ద్వారా పూడుకుపోయిన రక్తనాళాలలోకి రక్తాన్ని పంపింగ్ చేస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది. కానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత  విషమంగా ఉందని స్పష్టం చేసింది. పలువురు సీనియర్ కార్డియాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులు తారకరత్నకి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారని, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.


Related Post