బిఆర్ఎస్‌లో చేరిన ఒడిశా నేతలు

January 27, 2023


img

బిఆర్ఎస్‌ పార్టీ మెల్లగా ఇరుగు పొరుగు రాష్ట్రాలకి వ్యాప్తి చెందుతోంది. ఈరోజు ఒడిశా మాజీ సిఎం గిరిధర్ గమాంగ్‌, మాజీ మంత్రి శివార్జ్ పాంగి, ఇంకా ఒడిశాకి చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. సిఎం కేసీఆర్‌ వారందరికీ బిఆర్ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గిరిధర్ గమాంగ్‌ని తెలంగాణ బిఆర్ఎస్‌ నేతలకి పరిచయం చేస్తూ, ఒడిశాలో రైతుల సమస్యలపై ఆయన అలుపెరుగని పోరాటాలు చేసారని తెలిపారు. దేశంలో క్రియాశీల రాజకీయాలలో చాలా చురుకుగా ఉండే నాయకులలో ఆయన కూడా ఒకరని కేసీఆర్‌ అన్నారు. 

ఒకప్పుడు మహారాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండేదని అప్పుడు తెలంగాణ చాలా వెనకబాటు ఉండేది కనుక తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వలసలు ఉండేవని కానీ ఇప్పుడు మహారాష్ట్ర కంటే తెలంగాణ చాలా అభివృద్ధి చెందడంతో మహారాష్ట్ర నుంచే ఇప్పుడు తెలంగాణకి వలసలు కొనసాగుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇంత పరివర్తన తేగలిగినప్పుడు, వెంకబడిన ఒడిశాలో మాత్రం ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రంలో బిఆర్ఎస్‌ అధికరంలోకి వస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని అందుకు తాను మాట ఇస్తున్నానని కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో దేశంలో రావలసిన మార్పుల గురించి సిఎం కేసీఆర్‌ సోదాహరణగా వివరించారు. ఒడిశాలో బిఆర్ఎస్‌ పార్టీ పగ్గాలు గిరిధర్ గమాంగ్‌కి అప్పజెప్పబోతున్నట్లు సమాచారం. బహుశః నేడో రేపో సిఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించవచ్చు. 


Related Post