ఆరు సీట్ల బైక్‌... ఆనంద్ మహీంద్రా ఫిదా!

December 02, 2022


img

మహీంద్రా వాహనాల తయారీ సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసే సందేశాలు, ఫోటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఎవరూ ఊహించేలేనివి, కనీవినీ ఎరుగని అంశాలకు సంబందించిన వాటిని తన అభిమానులతో పంచుకోవడమే అందుకు కారణం. 

తాజాగా ఆయన మరో వీడియో పోస్ట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఓ మారుమూల గ్రామంలో ఓ యువకుడు ఆరు సీట్లు కలిగిన ఓ బైక్‌ తయారుచేశాడు. సాధారణంగా బైక్‌పై ఇద్దరు మహా అయితే ముగ్గురు మాత్రమే వెళ్ళగలరు. కానీ ఆరుగురు సౌకర్యవంతంగా కూర్చొని  వెళ్ళలేరు కదా? కానీ ఆ గ్రామీణ యువకుడు అటువంటి బైక్‌ తయారు చేసి చూపించాడు. అదీ.. కేవలం రూ.12,000లతో... ఎలక్ట్రిక్ బైక్‌! ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఆరుగురు వ్యక్తులు 150 కిమీ ప్రయాణించవచ్చని ఆ యువకుడు చెప్పాడు. 

వేలకోట్ల పెట్టుబడితో వాహనాలు తయారుచేసే పరిశ్రమని నడిపిస్తున్న ఆనంద్ మహీంద్రా దృష్టిని ఇది చాలా ఆకట్టుకొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మన గ్రామీణ భారతీయులు గొప్ప ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకొంటాయి. అవసరమే వారి ఆవిష్కరణలకి మూలం కావడం విశేషం. ఈ బైక్‌కి కొన్ని మార్పులు చేర్పులు చేసి మన పరిశ్రమలో తయారుచేయగలిగితే యూరోప్ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అత్యంత రద్దీగా ఉండే నగరాలకు ఈ రకం రవాణా సాధనం చాలా ఉపయోగపడుతుంది,” అని తన కంపెనీలో బోస్ ప్రతాప్ అనే నిపుణుడికి ఫార్వర్డ్ చేశారు.   

 



Related Post