తెలంగాణలో మళ్ళీ సమైక్యవాదుల హడావుడి: గుత్తా

December 02, 2022


img

తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళలో ఎన్నడూ లేనంత అశాంతి ప్రస్తుతం కనిపిస్తోంది. ఓ వైపు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు, మరోవైపు రాష్ట్రంలో బిజెపి నేతలు, వైఎస్ షర్మిల హడావుడి, మరోపక్క మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐ‌టి,ఈడీ, సీబీఐ దాడులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తుండటంతో రాష్ట్రంలో ఓ రకమైన అనిశ్చిత యుద్ధవాతావరణం నెలకొని ఉన్నట్లు కనిపిస్తోంది. 

వీటిపై శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. నల్గొండలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో మొహం చెల్లనివారు సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం మీద మిడతల దండులా వాలిపోతున్నారు. పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తినేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ని రాజకీయంగా ఎదుర్కొలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ఆస్తిరపరిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. బిజెపి దత్తపుత్రిక వైఎస్ షర్మిలని రంగంలో దింపి రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైఎస్ షర్మిల కుటుంబమే తమ అవినీతి పనులతో అనేకమంది ఐఏఎస్ అధికారులను జైళ్ళలో మగ్గేలా చేసిందని అందరికీ తెలుసు. తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. దానిని మనం కాపాడుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.


Related Post