తెలంగాణ ప్రభుత్వం నన్నే గౌరవించదు: గవర్నర్‌

December 02, 2022


img

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మళ్ళీ కేసీఆర్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రాజ్‌భవన్‌కి వచ్చి ఫిర్యాదు చేసి వెళ్ళిన తర్వాత గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌నైన నన్నే గౌరవించదు. ఇక ప్రతిపక్ష మహిళా నేతని గౌరవిస్తుందని ఎలా ఆశిస్తాము? వైఎస్ షర్మిలపై దాడి చేయడం, హైదరాబాద్‌లో పోలీసులు ఆమెను వాహనంలో తరలించిన తీరు చాలా బాధాకరం. ఓ మహిళా నేత పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. నేను ఈ ఘటనల గురించి డిజిపిని నివేదిక అడిగాను. కానీ ఆయన కూడా స్పందించలేదు. రాజ్‌భవన్‌ అంటే ఎవరికీ గౌరవం లేదనిపిస్తోంది. 

ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం ఎప్పుడో మానేసింది. నేను జిల్లా పర్యటనలకి వెళ్తే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఎస్పీ రావాలి కానీ రావడం లేదు. ప్రగతి భవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే వారు ఈవిదంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా నేను తొక్కిపెట్టానని దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరం. నా వద్దకు వచ్చిన బిల్లులను గుడ్డిగా సంతకం చేసేయలేను కదా?వాటిని పరిశీలించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నాను. కానీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. రాజ్‌భవన్‌ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మాత్రం చెప్పదలచుకొన్నాను,” అని అన్నారు.


Related Post