టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికీ బెయిల్‌

December 01, 2022


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రెడ్ హ్యాండ్‌గా పట్టుబడి చంచల్‌గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లకు ఈరోజు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ముగ్గురూ మూడు లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురూ పోలీసుల అనుమతి లేకుండా నగరం విడిచి బయటకు వెళ్ళరాదని, ప్రతీ సోమవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని ఆదేశించింది. 

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ముగ్గురి మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌ మరో రెండు కేసులు నమోదయ్యి ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, నకిలీ పాన్ కార్డులు, నకిలీ పాస్ పోర్టులు కలిగి ఉన్నారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. కనుక వారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బెయిల్‌ పొంది జైలు నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్‌ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ చంచల్‌గూడ జైలుకి పంపించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

ఇక ఫిల్మ్ నగర్‌లో నందకుమార్ పేరిట ఉన్న డెక్కన్ కిచెన్ లీజ్‌కి సంబందించి కూడా మరో కేసు ఉంది. కనుక వారు ఒక్కో కేసులో బెయిల్‌ పొంది బయటకు రాగానే మరో కేసులో లోనికి వెళ్ళక తప్పకపోవచ్చు. 


Related Post