మోడీ, ఈడీలకు భయపడేదేలే: కల్వకుంట్ల కవిత

December 01, 2022


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నిన్న కోర్టుకి సమర్పించిన నివేదికలో కల్వకుంట్ల కవితతో సహా 36 మంది పేర్లను పేర్కొంది. దీనిపై ఆమె స్పందిస్తూ, “మోడీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతోంది. ఈ 8 ఏళ్ళలో 9 ప్రభుత్వాలను దొడ్డిదారిలో కూల్చివేసారు. ఏ రాష్ట్రంలోనైంనా ఎన్నికలు వస్తున్నాయంటే మోడీ కంటే ముందు ఈడీ బృందాలు అక్కడికి చేరుకొని అక్కడి ప్రభుత్వాలలో మంత్రులు, ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు బనాయిస్తుంటాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారిని భయపెట్టి లొంగదీసుకొని అధికారంలోకి వస్తుంటుంది. తెలంగాణలో కూడా మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలొస్తున్నాయి. అందుకే ఈడీ, ఐ‌టి, సీబీఐలు రాష్ట్రంలో మన మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నాయి. 

కేసుల గురించి మీడియాకి లీకులు ఇచ్చి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తే మీకు తెలంగాణ ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారు. మోడీకి, బిజెపికి దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈడీ, ఐ‌టి, సీబీఐలను మాపైకి ఉసిగొల్పి భయపెట్టి లొంగదీయాలనుకోవడం చాలా నీచమైన ఆలోచన. రాజకీయంగా చాలా చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎత్తులు పనిచేయవని ప్రధాని నరేంద్రమోడీ గ్రహిస్తే మంచిది. కేసులకు మేము భయపడబోము. మా మీద ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాము. దర్యాప్తు సంస్థలు మాకు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తే ధైర్యంగా ఎదుర్కొని సమాధానాలు చెపుతాము. కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళలో వేస్తే వేసుకోమనండి. భయపడేది లేదు. మా వెంట ప్రజలు ఉన్నంతకాలం మేము ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు,” అని అన్నారు. 


Related Post