గుజరాత్‌లో నేడు మొదటి దశ పోలింగ్.. బిజెపికి మరో ఛాన్స్ ఇస్తారా?

December 01, 2022


img

బిజెపి కంచుకోటగా భావిస్తున్న గుజరాత్‌ రాష్ట్రంలో ఈరోజు మొదటి దశ పోలింగ్ జరుగబోతోంది. శాసనసభలో మొత్తం 182 స్థానాలకు నేడు 89 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 788 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 718 మంది పురుషులు, 70 మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు. బిజెపి (89), కాంగ్రెస్‌(89), ఆమాద్మీ (88), బీఎస్పీ (57), బిటిపి(14) లతో సహా 339 మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు.  

గుజరాత్‌లో గత 20 ఏళ్లుగా బిజెపియే అధికారంలో ఉంది. కనుక ప్రజలు మళ్ళీ బిజెపికి పట్టం కడతారా లేదా?అనే సందేహాలు నెలకొన్న ఈ సమయంలో ఆమాద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికలలో పోటీకి దిగింది. ఆమాద్మీ పార్టీ పంజాబ్‌లో పోటీ చేసి అధికారంలోకి రావడంతో ఇప్పుడు గుజరాత్‌లో కూడా బిజెపికి గట్టి పోటీ ఇస్తోంది. 

గుజరాత్‌ రాష్ట్రాన్ని సుమారు మూడు దశాబ్ధాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేస్తోంది. కనుక ఈ మూడు పార్టీల మద్య పోటీ ప్రధానంగా సాగనుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినట్లయితే ఈ ప్రభావం 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ చేతులు కలిపాయి. కనుక ఒకవేళ ఈ ఎన్నికలలో ఓడిపోతే బిజెపి పతనం ప్రారంభం అయినట్లే భావించవచ్చు. కనుక ఎట్టి పరిస్థితులలో గుజరాత్‌లో బిజెపి మళ్ళీ గెలిచి అధికారం నిలుపుకోవలసి ఉంటుంది. 

గుజరాత్‌లో రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్ డిసెంబర్‌ 5 తేదీన జరుగుతుంది. డిసెంబర్‌ 10వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అదే రోజున హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి. 



Related Post