గృహనిర్బందంలో బండి సంజయ్‌... యాత్రకు అనుమతించని పోలీసులు

November 28, 2022


img

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు నిర్మల్ జిల్లా భైంసా నుంచి మహాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించాలనుకొన్నారు. కానీ పోలీసులు దానికి అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి భైంసాకి బయలుదేరుతుండగా పోలీసులు ఆయనను అడ్డుకొని గృహనిర్బందంలో ఉంచారు. ఒకవేళ ఇంట్లో నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేయడంతో ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. హైకోర్టు అనుమతిస్తే యధాప్రకారం భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు బండి సంజయ్‌ వేచిచూస్తున్నారు. ఒకవేళ హైకోర్టు పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే ఏం చేయాలనేదానిపై బిజెపి నేతలు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. 

బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర పేరిట ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ఆయన పాదయాత్రలో టిఆర్ఎస్‌, బిజెపి శ్రేణుల మద్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. అయితే బండి సంజయ్‌ పాదయాత్రతో రాష్ట్రంలో బిజెపి బలపడుతోంది కనుకనే కేసీఆర్‌ ప్రభుత్వం ఆయనను పోలీసులతో అడ్డగిస్తోందని బిజెపి నేతలు వాదిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఆమె కూడా నిత్యం సిఎం కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ పోలీసులు ఆమెని అడ్డుకోవడం లేదు. ఎందుకంటే ఆమె ఎంత పాదయాత్ర చేసినా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ప్రజాధారణ లేదు. కనుకనే ఆమె పాదయాత్రని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. కానీ బిజెపి నేతలు వాదిస్తున్నట్లు బండి సంజయ్‌ పాదయాత్రతో రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని టిఆర్ఎస్‌ భావిస్తోంది కనుకనే అద్దుకొంటున్నట్లు భావించవచ్చు. నిజానికి టిఆర్ఎస్‌ శ్రేణులు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడులకు పాల్పడుతుండటం వలననే ఆయన పాదయాత్ర మరింత హైలైట్ అవుతోందని చెప్పవచ్చు. కనుక తెలంగాణ ప్రభుత్వం ఆయన పాదయాత్రను అడ్డుకోవడం కంటే టిఆర్ఎస్‌ శ్రేణులను ఆయన పాదయాత్రకు దూరంగా ఉంచితే సరిపోతుంది కదా?


Related Post