ఐ‌టి అధికారులపై మంత్రి మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!

November 24, 2022


img

మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్ళు, కాలేజీలు, కార్యాలయాలలో రెండురోజులుగా సాగిన ఐ‌టి సోదాలు నిన్న రాత్రి ముగిశాయి. ఐ‌టి అధికారులు మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్ళు, కాలేజీల నుంచి రూ.10.50 కోట్లు నగదు స్వాధీనం చేసుకొన్నారు. రెండు సూట్ కేసులు, ఆరు బ్యాగులలో మల్లారెడ్డి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలకు సంబందించి కీలక డాక్యుమెంట్లు పట్టుకువెళ్లారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలలో డొనేషన్ల పేరుతో రూ.100 కోట్లు వసూలు చేసి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన్నట్లు ఐ‌టి అధికారులు గుర్తించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి, ఆయన కుమారులు, అల్లుడికి  నోటీసులు ఇచ్చి సోమవారం తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించి ఐ‌టి అధికారులు వెళ్ళిపోయారు.

మొన్న సాయంత్రం వరకు చాలా ధీమాగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి నిన్న అర్దరాత్రి ఐ‌టి అధికారులు సోదాలు ముగించుకొని తిరిగివెళుతున్నప్పుడు వారిపై తీవ్ర ఆగ్రహావేశాలతో విరుచుకుపడటం విశేషం. తాము వారికి ఎంతగా సహకరించినప్పటికీ, తాము వందల కోట్లు అక్రమాలకు పాల్పడ్డామని రిపోర్టులు తయారుచేసి, తన కొడుకు మహేందర్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి చేసి వాటిపై సంతకాలు చేయించుకొన్నారని ఆరోపించారు. ఐ‌టి అధికారులు తమని అక్రమకేసులలో ఇరికించాలనే ఉద్దేశ్యంతోనే తన కొడుకు చేత సంతకాలు చేయించుకొన్నారని మంత్రి మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మల్లారెడ్డి కాలేజీలలో విద్యార్థుల నుంచి గత మూడేళ్లలో రూ.100 కోట్లు డొనేషన్లుగా వసూలు చేసినట్లు ఐ‌టి అధికారులు ఓ రిపోర్ట్ తయారుచేసి దానిపైనే మహేందర్ రెడ్డి సంతకం తీసుకొన్నట్లు సమాచారం. కనుక దీంతో ఐ‌టి అధికారులు మంత్రి మల్లారెడ్డి ఆర్ధిక సామ్రాజ్యాన్ని కూల్చివేసే ప్రమాదం పొంచి ఉందని భావించవచ్చు. బహుశః అందుకే ఆయన అంత ఆందోళన చెందుతున్నట్లు అర్దం అవుతోంది.

(Video Courtecy: Eenadu Media)

Related Post