తెలంగాణ పోలీసులు ఆ ముగ్గురినీ విచారణకు రప్పించగలరా?

November 23, 2022


img

నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందానికి (సిట్) ఊహించినట్లే కొత్త తల నొప్పులు మొదలయ్యాయి. జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను ప్రశ్నించగలిగారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిలో రాష్ట్రంలో ఉన్నవారిని పిలిపించుకొని ప్రశ్నించగలిగారు. కానీ ఈ కేసులో ముగ్గురు నిందితుల సంభాషణలలో పదేపదే చెప్పిన కేరళలోని తుషార్, జగ్గుస్వామి, ఢిల్లీలో నివాసం ఉండే బిఎల్ సంతోష్లను మాత్రం విచారణకు రప్పించలేకపోయారు.

వారు ముగ్గురూ అత్యంత పలుకుబడి గలిగిన వ్యక్తులు, అధికార పార్టీకి బాగా కావలసినవారు కనుక ఢిల్లీ, కేరళ పోలీసుల సహకారం సిట్ బృందానికి లభించలేదు. కనుక సిట్ బృందం వారు ముగ్గురికీ నోటీసులు అందజేయలేకపోయింది. అతికష్టం మీద బిఎల్ సంతోష్ పేరిట ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో నోటీస్ అందించగలిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం, సిట్ పరిమితులను బయటపెట్టిందని చెప్పవచ్చు. 

కనుక వారు ముగ్గురికీ నోటీసులు అందజేసి, విచారణకు వచ్చేలా చేయాలని కోరుతూ సిట్ బృందం తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేయవలసి వచ్చింది. దానిపై ఈరోజు ఉదయం విచారణ చేపట్టిన హైకోర్టు, దీనిపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూద్దామని చెపుతూ మధ్యాహ్నం 2.30 గంటలకి ఈ కేసును వాయిదా వేసింది. ఒకవేళ హైకోర్టు వారు ముగ్గురి పేరిట అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే తప్ప సిట్ బృందం అడుగు ముందుకు వేయలేదు. కానీ ఈ కేసు వెనుక రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న హైకోర్టు అటువంటి నిరనాయమ్ తీసుకొంటుందా? తీసుకోకపోతే సిట్ బృందం మళ్ళీ సుప్రీంకోర్టునే ఆశ్రయించక తప్పదు.


Related Post