మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కాలేజీలపై రెండో రోజు కొనసాగుతున్న ఐ‌టి దాడులు

November 23, 2022


img

కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా నిలుస్తున్న మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కాలేజీలు, కార్యాలయాలపై ఐ‌టి శాఖ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడే ఐ‌టి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు, కుమారులు, బంధువుల ఇళ్ళలో కూడా ఐ‌టి అధికారులు నేడు సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన కాలేజీలలో ఆర్ధిక లావాదేవీలను ఐ‌టి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లెక్కలలో చూపని రూ.8.8 కోట్లు నగదుని నిన్న స్వాధీనం చేసుకొన్నారు. అలాగే ఆర్ధిక లావాదేవీలకు సంబందించి పలు పత్రాలను కూడా ఐ‌టి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

మల్లారెడ్డి కుటుంబం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐ‌టి అధికారులు వాటికి సంబందించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజీలకు డైరెక్టరుగా ఉన్న మహేందర్ రెడ్డి ఇంట్లో నిన్న ఐ‌టి అధికారులు సోదాలు జరుపుతున్నప్పుడు ఆయనకి ఛాతిలో నొప్పి రావడంతో సూరారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కేంద్ర బలగాలు, పోలీసుల పహారాలో 50 ఐ‌టి బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. 

మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కాలేజీలపై ఐ‌టి దాడుల నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ నిన్న అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్‌ అత్యవసర సమావేశం నిర్వహించి వీటిని ఏవిదంగా ఎదుర్కోవాలో చర్చించారు. మోడీ ప్రభుత్వం ఐ‌టి, ఈడీ, సీబీఐలను బిజెపియేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏవిదంగా వేధిస్తోందో వివరాలు సేకరించి, వాటి గురించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వాటితో ఐ‌టి దాడులను ఆపలేమని కేసీఆర్‌కి కూడా తెలుసు. 


Related Post