మార్చిలోగా సిద్ధిపేటకు ప్యాసింజర్ రైలు: మంత్రి హరీష్‌

November 23, 2022


img

తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై జిల్లాకు సంబందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. జిల్లాలో దుద్దెడ వరకు రైల్వే లైన్ నిర్మాణపనులు దాదాపు పూర్తయినందున జనవరిలోగా దుద్దెడ వరకు ప్యాసింజర్ రైలు రాబోతోందని తెలిపారు. అయితే దుద్దెడ నుంచి సిద్ధిపేట వరకు రైల్వేలైన్ పనులను వేగవంతం చేసేందుకు జిల్లా అధికారులు అందరూ రైల్వే సిబ్బందికి అన్ని విదాల సహకరించాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.

ఎట్టి పరిస్థితులలో వచ్చే ఏడాది మార్చినాటికి సిద్ధిపేటకు ప్యాసింజర్ రైలును తీసుకురావడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు. రైల్వేలైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులను కేటాయించి భూనిర్వాసితులకు చెల్లింపులు కూడా పూర్తి చేసింది కనుక ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా చకచకా పనులు సాగేలా అధికారులు కృషి చేయాలని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. వచ్చే నెలాఖరులోగానే కుకునూరుపల్లి వరకు ప్యాసింజర్ రైలు రాబోతోందని రైల్వే అధికారి జనార్ధన్ చెప్పడంపై మంత్రి హరీష్‌ రావుతో సహా సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ హర్షం వ్యక్తం చేశారు. 

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యం అవుతోందని అధికారులు తెలుపగా సంబందిత ఉన్నతాధికారులతో తాను స్వయంగా మాట్లాడి వారం రోజులుగా ఈ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ఈలోగా జిల్లా అధికారులు కూడా అటవీశాఖ అభ్యంతరాలకు పరిష్కారాలను సిద్దంచేసి ఉంచుకోవాలని సూచించారు. 

సిద్ధిపేటలో సిద్దమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయుష్ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.  

దుబ్బాకలో కొత్తగా బస్టాండ్ నిర్మాణం, మిట్టపల్లిలో మహిళా సమాఖ్య భవనం, వృద్ధాశ్రమం, రంగనాధపల్లిలో త్రీ-టౌన్ పోలీస్ స్టేషన్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణాలు చేపట్టడానికి తగిన స్థలాలను ఖరారు చేసి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.


Related Post