నాగర్ కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌ పద్మావతి ఎన్నిక చెల్లదు: హైకోర్టు

November 22, 2022


img

నాగర్ కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌ పద్మావతి ఎన్నిక చెల్లదని హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నందున నిబందనల ప్రకారం ఆమె ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎన్నికైన సుమిత్ర, జిల్లా ఎన్నికల ట్రిబ్యూనల్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలీచించిన ట్రిబ్యూనల్  2022, జూలై 15న పద్మావతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడమే కాకుండా సుమిత్ర గెలిచినట్లుగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

అయితే ట్రిబ్యూనల్ తీర్పుని సవాలు చేస్తూ పద్మావతి  హైకోర్టులో అప్పీల్ చేసుకొన్నారు. సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కూడా పద్మావతి ఎంపిక చెల్లదని తీర్పు చెప్పింది. కనుక పద్మావతి స్థానంలో కాంగ్రెస్‌కి చెందిన సుమిత్ర జెడ్పీ ఛైర్ పర్సన్‌ పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 

కానీ కీలకమైన ఆ పదవిని టిఆర్ఎస్‌ చేజార్చుకోవాలనుకోవడం లేదు. పద్మావతి స్థానంలో కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్‌ లేదా ఉర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మావతి స్థానంలో తనను నియమించాలని జిల్లా ఎలక్షన్స్ ట్రిబ్యూనల్ తీర్పు చెప్పినందున తక్షణం తనను నాగర్ కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌గా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎన్నికైన సుమిత్ర డిమాండ్ చేస్తున్నారు. కానీ టిఆర్ఎస్‌ ఈ పదవిని వదులుకోవడానికి సిద్దంగా లేదు. కనుక నాగర్ కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌ నియామకంలో తెర వెనుక ఎటువంటి రాజకీయాలు జరుగుతాయో వేచి చూడాలి. 


Related Post