దసరానాడే కేసీఆర్‌ జాతీయపార్టీ ప్రకటన?

September 28, 2022


img

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని నిర్ణయించుకొన్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లు తాజా సమాచారం. ఆ రోజు ఉదయం తన ఫాంహౌసులో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యి మరోసారి వారితో చర్చించిన తర్వాత సిఎం కేసీఆర్‌ జాతీయపార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

టిఆర్ఎస్‌ను జాతీయపార్టీలో విలీనం చేసే చట్టపరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ స్థాపించబోతున్న జాతీయపార్టీ పేరు ‘భారత్‌ రాష్ట్ర సమితి’ అని ఇప్పటికే మీడియాకు లీకులు వచ్చాయి. గులాబీ రంగు జెండాలో భారతదేశం చిత్రపఠం ఉంటుందని సమాచారం.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశం డిసెంబర్‌ వరకు వాయిదా వేసుకొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆలోపుగా జాతీయ పార్టీ ప్రకటించి, పార్టీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసే ఆలోచనలో సిఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తను టిఆర్ఎస్‌ ఇంకా దృవీకరించవలసి ఉంది. Related Post