దేశంలో మరో కొత్త పార్టీ.. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ

September 26, 2022


img

సుమారు 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకొన్నారు. ఇవాళ్ళ జమ్మూలో తన కొత్త పార్టీ పేరు, జెండా, ఆశయాలను ఆజాద్ ప్రకటించారు. 

తన కొత్త పార్టీ పేరు డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ అని, తమ పార్టీ ప్రజాస్వామ్యం, శాంతి, స్వతంత్రానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆజాద్ చెప్పారు. పార్టీ జెండాలో పసుపు సృజనాత్మకతకు, ఏకత్వానికి నిదర్శనంగా ఉంటాయని తెలుపు శాంతికి, నీలం స్వేచ్చా స్వాతంత్ర్యాలకి సంకేతమని చెప్పారు. త్వరలో జరుగబోయే జమ్ము కశ్మీర్  ఎన్నికలలో తమ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆజాద్ ప్రకటించారు.

ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా కనుసన్నలలో గులాం నబీ ఆజాద్ మెసులుకొంటున్నారని, వారి సూచనపైనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి హడావుడిగా కొత్త పార్టీ ఏర్పాటు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్‌లో పిడిపి, నేషనల్ ఫ్రంట్ పార్టీలు తమా స్వలాభం కోసం కశ్మీర్‌ను ఓ యుద్ధభూమిగా మార్చేశాయని, కనుక ఆ రాష్ట్రానికే చెందిన గులాం నబీ ఆజాద్ వంటి అనుభవజ్ఞుడితో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగేలా చేస్తే మళ్ళీ కాశ్మీర్‌కు పూర్వవైభవం వస్తుందని ప్రధాని నరేంద్రమోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఊహాగానాలు నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్‌లో బిజెపితో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ఊహాగానాలు నిజమని భావించవచ్చు. ఒకవేళ ఆయన తెలంగాణ సిఎం కేసీఆర్‌ వంటివారితో చేతులు కలిపితే నిజంగానే బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు భావించవచ్చు.


Related Post