తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ?

September 23, 2022


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో పదేపదే సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు త్వరలోనే ఆ కేసుతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపిస్తారని ఊహాగానాలు వినిపిస్తుంటే, ఈడీ అధికారులు హటాత్తుగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు పంపించినట్లు వార్తలు వస్తుండటం విశేషం. 

సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ నిధుల మళ్ళింపు కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలు షబ్బీర్ ఆలీ, సుదర్శన్ రెడ్డి ఇద్దరికీ ఈడీ నోటీసులు పంపించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై షబ్బీర్ అలీ వెంటనే స్పందిస్తూ ఇంతవరకు ఈడీ తనకు ఎటువంటి నోటీసులు పంపించలేదని, ఒకవేళ పంపిస్తే తప్పకుండా ఈడీ కార్యాలయానికి వెళ్ళి వారి విచారణకు సహకరిస్తానని చెప్పారు. 

 నేషనల్ హెరాల్డ్ నిధుల మళ్ళింపు కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీని పలుమార్లు ఢిల్లీలో తమ కార్యాలయానికి రప్పించి విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ నాయకులకు నోటీసులు పంపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది.


Related Post