దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. వందమందికి పైగా అరెస్ట్

September 22, 2022


img

గత యూపీయే ప్రభుత్వ హయంలో  దేశంలో తరచూ ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉండేవి. అప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలో దిగి దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నించేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల దాడులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు దాడులు జరుగక ముందే నిఘా పెట్టి ఎన్ఐఏ ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తూ అనుమానితులను అరెస్ట్ చేస్తోంది కనుక. 

బుదవారం దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణతో సహా మొత్తం 13 రాష్ట్రాలలో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించి 105 మందిని అనుమానితులను అరెస్ట్ చేశాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, దాని కోసం శిక్షణ, నిధుల సమీకరణ చేస్తున్న సంస్థలపై, వ్యక్తుల ఇళ్ళలో సోదాలు నిర్వహించాయి. ఉగ్రవాదం కోసం వారు నిధులు సమీకరిస్తున్నందున ఈసారి సోదాలలో ఎన్ఐఏతో పాటు ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సోదాలలో అనేక దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. 

అరెస్ట్ అయినవారిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్, బహ్రెయిన్, దేశాల నుంచి నిధులు సేకరించేందుకు జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొన్నారు. మొత్తం 600 మంది అనుమానితుల బ్యాంక్ ఖాతాలను, మరో 2600 బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా వాటిలో చాలా వరకు బోగస్ ఖాతాలే అని ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాలలోకి నిధులు సమీకరించడంతో పాటు హవాలా విధానంలోను, కొన్నిసార్లు వ్యక్తిగతంగానూ నిధులు తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. ఎన్ఐఏ అధికారులు నిన్న జరిపిన సోదాలలో రివాల్వర్లు, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు.


Related Post