గిరిజన రేజర్వేషన్స్ పెంపు నిర్ణయంతో నోటిఫికేషన్లకు ఆటంకం?

September 21, 2022


img

తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరిగిపోతుండటంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా సంతోషిస్తోంది. అయితే ఇటీవల సిఎం కేసీఆర్‌ గిరిజనులకు రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ త్వరలోనే జీవో జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో గందరగోళం మొదలైంది. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కానీ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే 54 శాతం అవుతుంది. దానిని అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టసవరణ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఇదివరకే తెలంగాణ శాసనసభలో ఓ తీర్మానం చేసి పంపామని కానీ కేంద్ర ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని సిఎం కేసీఆర్‌ మొన్న మరోసారి ఆరోపించారు. కనుక తమ ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేస్తుందని దానిని ప్రధాని నరేంద్రమోడీ ఆమోదిస్తారో దాంతో ఉరేసుకొంటారో తేల్చుకోవాలని కేసీఆర్‌ సవాల్ విసిరారు. 

ఈ రిజర్వేషన్లపై కేంద్రం పట్టించుకోలేదని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెపుతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా పట్టించుకోదని అర్దమవుతోంది. మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేయబోతోంది?అమలుచేయలేకపోతే దాని కోసం జీవో ఎందుకు జారీ చేస్తున్నట్లు?మునుగోడు ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఈ రిజర్వేషన్లు అమలుచేయలేమని తెలిసీ కేంద్రాన్ని నిందిస్తూ ఉపఎన్నికలలో లబ్దిపొందుదామని కేసీఆర్‌ భావిస్తున్నట్లయితే ఆయన విశ్వసనీయతే దెబ్బ తింటుంది.       

ఒకవేళ ఈ రిజర్వేషన్లను ఏదోవిదంగా అమలు చేసే మాటయితే, ఇక ముందు జారీ చేయబోయే నోటిఫికేషన్లన్నిటికీ దీనిని వర్తింపజేస్తారా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వర్తింపజేయదలిస్తే ఈ మేరకు రిజర్వేషన్ల కోటాలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కనుక నోటిఫికేషన్ల విడుదల ఆలస్యం అవుతుందని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక సిఎం కేసీఆర్‌ లేదా ప్రభుత్వం తరపున మంత్రులు లేదా టిఎస్‌పీఎస్సీ దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


Related Post