పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య కారణం ఏమిటంటే

August 09, 2022


img

గుంటూరులో ఆకాష్ (18) అనే పదో తరగతి విద్యార్ధి సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో తల్లి చీరతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను సెల్ ఫోన్‌ కొనివ్వలేదనో, పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయనో ఆత్మహత్య చేసుకోలేదు. స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడు!

గుంటూరు నగరంలో రైలుపేటలో నివశిస్తున్న అంజమ్మ భర్త 8 ఏళ్ళ క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కూలిపనులు చేస్తూ వెంకటేష్, ఆకాష్ ఇద్దరు కొడుకులను పోషిస్తోంది. ఇంట్లో పరిస్థితి బాగోలేకపోవడంతో వెంకటేష్ చదువు మానేసి తల్లితో కలిసి కూలిపనులు చేస్తున్నాడు. ఆకాష్ స్కూలుకి వెళుతున్నా చదువులలో బాగా వెనుకబడిపోయాడు. 

అతను చదువులలో ఎందుకు వెనుకబడిపోయాడో తెలుసుకొని తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు రోజూ అతనిని మందలిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆకాష్ మిగిలిన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం పధకంలో ఇచ్చిన అన్నం తింటూ ఉండగా ఓ ఉపాద్యాయురాలు వచ్చి “చదువురానివాడికి తిండి కూడా దండగే.. ” అంటూ అతని చేతిలో అన్నం పళ్ళెం లాక్కొని పంపించేసింది! 

దాంతో కుమిలిపోతున్న ఆకాష్ను ఓదార్చి, ఆమెకు బుద్ధి చెప్పావలసిన మరో ఉపాధ్యాయుడు, “చదువు అబ్బనప్పుడు ఇంకా మా ప్రాణాలు తీయడం ఎందుకురా... టీసీ తీసుకొని పోవచ్చు కదా?” అంటూ ఈసడించుకొన్నాడు!

ఆ వయసు కుర్రాడిపై తమ మాటలు ఎంత ప్రభావం చూపుతాయో ఉపాధ్యాయులు గ్రహించలేకపోయారు. మరుసటి రోజు నుంచి ఆకాష్ స్కూలుకి వెళ్ళడం మానేసి తల్లి వెంటే తిరుగుతున్నాడు. తల్లికి తన బాధ చెప్పుకొని ఏడుస్తుంటే ఆమె కొడుకుని ఓదార్చేందుకు ప్రయత్నించింది. మెల్లగా సర్దుకొంటాడనుకొంది. కానీ ఇంత పని చేస్తాడనుకోలేదు. 

సోమవారం మధ్యాహ్నం అన్న వెంకటేష్ వంటకని కూరలు కొని తెచ్చేందుకు బయటకి వెళ్లినప్పుడు ఆకాష్ తల్లి చీరతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేష్ అది చూసి ఏడుస్తూ ఇరుగుపొరుగులకి చెప్పగా వారు అతని తల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె పరుగున వచ్చి తన చీరకే వ్రేలాడుతున్న కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ఇద్దరు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.


Related Post