ఏమిటిది రేవంత్‌… నీ మాటతీరు బాలేదు: వెంకట్ రెడ్డి

August 04, 2022


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పార్టీలో చిన్న ఉప్పెన సృష్టించిందని చెప్పవచ్చు. ఆయన రాజీనామా చేయగానే రేవంత్‌ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వాటికి ఆయన అంతే ఘాటుగా జవాబిచ్చారు కూడా. 

అయితే రేవంత్‌ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అన్నారో లేదో పొరపాటున అన్నారో గానీ ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ అనడంతో రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. నా సోదరుడు పార్టీ విడిచిపెట్టి పోతే నేను కూడా వెళ్ళిపోబోతునాన్నట్లు రేవంత్‌ రెడ్డి మాట్లాడటం సరికాదు. నేను 34 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాను. ఎప్పటికీ ఉంటాను. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి నా గురించి ఆవిదంగా మాట్లాడటం సరికాదు. కనుక రేవంత్‌ రెడ్డి ఆ మాటలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాల్సిందే,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించని వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకరు. కనుక ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతే బాగుండునని రేవంత్‌ రెడ్డి కోరుకొంటున్నారేమో?అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈరోజు భువనగిరిలో మాట్లాడుతూ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మా పార్టీలోకి వస్తారని మేము నమ్మకంగా ఉన్నాము,” అని చెప్పడం విశేషం. 

రేవంత్‌ రెడ్డిపై సీనియర్ నేతలకు నమ్మకం లేదు. వారిపై రేవంత్‌ రెడ్డికి నమ్మకం లేదు. ఈ పరిస్థితులలో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఏవిదంగా ముందుకు తీసుకువెళ్ళగలరు? ఏవిదంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరనేదే ప్రశ్న.


Related Post