ఈ క్రెడిట్ అంతా డిజిపి మహేందర్ రెడ్డిదే: కేసీఆర్‌

August 04, 2022


img

ఈరోజు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (టిఐసీసీసీ) భవనాన్ని ప్రాంభించిన సిఎం కేసీఆర్‌, ఆ భవన నిర్మాణ క్రెడిట్ అంతా డిజిపి మహేందర్ రెడ్డిది, ఇటువంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించిన ఇంజనీర్లు, అధికారులు, కార్మికులదే అని ప్రశంశలు కురిపించారు. రాష్ట్రానికి ఇటువంటి కమాండ్ కంట్రోల్ ఒకటి ఉండాలనే ఆలోచన డిజిపి మహేందర్ రెడ్డిదే. ఆయన ఆలోచన నుంచి, ఆయన పర్యవేక్షణలో రూపొందినదే ఇది. అసలు ఇటువంటి అద్భుతమైన కట్టడం వస్తుందని ఎవరూ ఊహించలేదని కానీ బలమైన సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అని ఇది నిరూపించిందని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

డిజిపి మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తరువాత కూడా ఆయన సేవలను ఏదోవిదంగా ఉపయోగించుకొంటామని చెప్పారు. తెలంగాణ పోలీస్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అమెరికాలో పోలీస్ వ్యవస్థ ఏవిదంగా పనిచేస్తుందో అదేవిదంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థని కూడా క్రమంగా మార్చుతామని చెప్పారు. 

రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటివి భావితరాలకు తీరని నష్టం కలిగిస్తాయని కనుక వాటిని కట్టడి చేయడానికి డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తాను డిజిపి మహేందర్ రెడ్డికి సూచించానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకొన్న ఈ భవనం పోలీస్ కేంద్ర కార్యాలయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో వివిద శాఖలతో సమన్వయం కలిగి ఉంటుందని, ప్రకృతి విపత్తుల సమయంలో ఇది పూర్తిగా వాటిని ఎదుర్కొనే కేంద్రంగా పనిచేస్తుందని సిఎం కేసీఆర్‌ చెప్పారు.


Related Post