కొల్లాపూరులో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన టిఆర్ఎస్‌ నేతలు

June 27, 2022


img

నాగర్‌కర్నూలు జిల్లాలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మద్య మొదలైన విభేధాలు నిన్న మధ్యాహ్నం వరకు కొల్లాపూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాయి. పాలమూరు రంగారెడ్డి పధకంలోని అంజనగిరి జలాశయంలో ముంపు గ్రామాలలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో జూపల్లి ఆరోపణలతో వివాదం మొదలైంది. 

బీరం హర్షవర్ధన్ రెడ్డి నిర్వాసితులందరికీ నష్టపరిహారం ఇప్పించకుండా తన వర్గీయులకు మాత్రమే ఇప్పించుకొంటున్నారని జూపల్లి ఆరోపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా అవినీతిలో మునిగితేలుతున్నదని జూపల్లి ఆరోపించారు. దీనిపై బీరం హర్షవర్ధన్ రెడ్డి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని జూపల్లి సవాలు విసిరారు. 

జూపల్లి ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జూపల్లితో చర్చకు సిద్దమని ప్రకటించారు. అయితే ఆదివారం ఉదయం మీ ఇంటికే వస్తాను సిద్దంగా ఉండమని ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు నేతలకు మద్దతుగా  వందలాదిగా అనుచరులు వారి వారి ఇళ్ళ వద్దకు తరలిరావడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు నిన్న కొల్లాపూరులో 144 సెక్షన్ విధించి, ఇద్దరు నేతలను గృహ నిర్బందం చేశారు.  

ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జూపల్లి ఇంటికి బయలుదేరబోగా పోలీసులు ఆయన అడ్డుకొని అదుపులోకి తీసుకొని వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. 

మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఆయన కోసం ఎదురుచూసిన జూపల్లి కృష్ణారావు కూడా హైదరాబాద్‌ వెళ్లిపోవడంతో వారి అనుచరులు కూడా తిరిగి వెళ్ళిపోయారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. 

వారిరువురూ ఈ స్థాయిలో మీడియా ముందుకు వచ్చి పరస్పరం సవాళ్ళు, అవినీతి ఆరోపణలు చేసుకొంటున్నా టిఆర్ఎస్‌ అధిష్టానం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత కొంత కాలంగా జూపల్లి కృష్ణారావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో మంత్రి కేటీఆర్‌ ఇటీవల కొల్లాపూరులో పర్యటించినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ఆ తరువాత కూడా ఈ డ్రామా సాగడం ఆలోచింపవలసిన విషయమే. 


Related Post