ఈటల కబ్జా చేసిన భూముల కోసం రైతులు ఆందోళన

June 25, 2022


img

హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ కంపెనీ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, హక్కింపేటలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సుమారు 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిందంటూ గత ఏడాది నవంబర్‌లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు.

సర్వే పూర్తయిన తరువాత వాటి యజమానులను గుర్తించి వారికి అసైన్డ్ భూములు తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత ఆ భూముల ఊసే ఎత్తడం లేదు... ఇంతవరకు ఆ భూములను వాపసు చేయలేదంటూ అచ్చంపేట గ్రామ సర్పంచ్ రాచందర్ అధ్వర్యంలో శుక్రవారం హక్కింపేట, అచ్చంపేట, ధర్విపల్లి గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ర్యాలీ నిర్వహించి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌ రమేష్‌కు వినతి పత్రం ఇచ్చారు. పది రోజులలోగా తమ భూములను తమకు ఇవ్వకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం వారు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి తమ భూములు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన స్పందిస్తూ తక్షణం ఈ విషయాన్ని సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళి భూములు తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.


Related Post