టిఆర్ఎస్‌కి మరో షాక్... కాంగ్రెస్‌లో చేరిన తాటి వెంకటేశ్వర్లు

June 24, 2022


img

టీఎస్‌ఆర్టీసీ పార్టీకి వరుసగా షాకు మీద షాకులు తగులుతున్నాయి. అదీ... ఇక పనైపోయిందనుకొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి! గురువారం ఖైరతాబాద్ టిఆర్ఎస్‌ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఇవాళ్ళ ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకశ్వర్లు జెడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వారందరికీ కాంగ్రెస్‌ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం తాటి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, “రేషన్ కార్డులు, పింఛనులు ఇవ్వాలని ప్రజలు మాపై ఒత్తిడి చేస్తున్నారని మేము తరచూ జిల్లా మంత్రులకు, పార్టీ పెద్దలకు గుర్తుచేస్తున్నా ఏనాడూ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. పంట రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్మరించారు. ధరణీ ప్రవేశపెట్టి అప్పుడే రెండేళ్ళు కావస్తోంది. అయినా నేటికీ దాంతో ఏవో ఓ సమస్యలే. ధరణితో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెపుతున్నా పట్టించుకొనే నాధుడు లేడు. 

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే సరిపోతుందా రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పట్టించుకోనక్కర లేదా? జిల్లాలలో ఏజన్సీ ప్రాంతాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోనవసరం లేదా?అలాగైతే ఎన్నికలలో ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతాము? 

పినపాక ఎమ్మెల్యే (రేగ కాంతారావు) దృష్టి ఎప్పుడూ ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తుందా ఎప్పుడు కబ్జా చేద్దామనే ఉంటుంది. అది తప్పితే ఇసుక మాఫియా.. అంతే ప్రజాసమస్యలను పరిష్కరించాలనే ఆసక్తే లేదు. టిఆర్ఎస్‌ అధిష్టానం జిల్లా నేతల తీరుతో విసుగెత్తిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బడుగుబలహీన వర్గాలు గిరిజనుల సమస్యల పట్ల అవగాహన, పరిష్కరించాలనే తపన ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలో టిఆర్ఎస్‌ పార్టీకి పరాజయం తప్పదు,” అని అన్నారు.


Related Post