ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి వైసీపీ బేషరతు మద్దతు

June 24, 2022


img

రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ఆమెకు సొంత రాష్ట్రంలోని అధికార బీజెడి మద్దతు ప్రకటించడంతో ఆమె గెలుపు ఖాయమైనది. తొలిసారిగా ఓ ఆదివాసి తెగకు చెందిన మహిళకు దేశంలో అత్యున్నతమైన ఈ పదవికి పోటీ చేస్తున్నందున దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీలు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆమె భారీ ఆధిక్యతతో విజయం సాధించబోతున్నారు. కనుక నామినేషన్ వేయకముందే ఆమె గెలుపు, కాంగ్రెస్‌ మిత్రపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓటమి రెండూ ఖాయం అయిపోయాయి. ఈరోజు ఆమె నామినేషన్ వేసే కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.   

ద్రౌపది ముర్ము బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే తరపున పోటీ చేస్తున్నందున ఆమెకు టిఆర్ఎస్‌ పార్టీ మద్దతు ఇస్తుందో లేదో ఇంతవరకు ప్రకటించలేదు. అలాగే కాంగ్రెస్‌ మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందో లేదో తెలుపలేదు. అయితే ద్రౌపది ముర్ము సామాజిక నేపద్యాన్ని దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్‌ పార్టీ కూడా ఆమెకు మద్దతు తెలిపే అవకాశం ఉంది.


Related Post