హైదరాబాద్‌ నగరంలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

June 21, 2022


img

హైదరాబాద్‌ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్‌లను నిర్మిస్తూనే ఉంది. ఈ 8 ఏళ్లలో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 30 ఫ్లైఓవర్లు నిర్మించిందంటే చాలా గొప్ప విషయమే. తాజాగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఈరోజు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 

రూ.86 కోట్లు వ్యయంతో నాలుగు వరుసలతో నిర్మించారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశలో భాగంగా రూ.8,502 కోట్లు వ్యయంతో ఇటువంటివి 47 పనులు, మరో రూ.3,115 కోట్లు వ్యయంతో రెండో దశ పనులు ప్రారంభిచినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నగరంలో మరో 17 ఫ్లైఓవర్లు వివిదదశలలో ఉన్నాయని అవి కూడా ఒకటొకటిగా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

కైతలాపూర్ వద్ద ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీల మద్య నిత్యం ప్రయాణించేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. జెఎన్టీయు జంక్షన్, మలేషియాన్ టౌన్ షిప్, హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌ను ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో సనత్ నగర్‌ నుంచి బాలానగర్ మీదుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు 3.5 కిమీ దూరం, అరగంట ప్రయాణ సమయం తగ్గుతాయి. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “త్వరలో ప్రధాని నరేంద్రమోడీ నగరానికి వస్తున్నారు. ఇక్కడ బిజెపి నేతలు ఆయన చెవిలో చెప్పిన నాలుగు ముక్కలనే ఆయన వల్లెవేసి వెళ్ళిపోతారు తప్ప హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు ఈ నగరానికి, రాష్ట్రానికి ఏమిస్తున్నాము?అని మాత్రం ఆలోచించరు. రాష్ట్ర బిజెపి నేతలు కూడా అడగరు. ప్రశాంతంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజల మద్య మతచిచ్చు రగిలించి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటివారిని దూరంగా ఉంచుతూ మనం మన నగరాన్ని, రాష్ట్రాన్ని ఇలాగే అభివృద్ధి చేసుకొందాము,” అని అన్నారు. 


Related Post