రాజీవ్ హత్య కేసులో దోషి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ

May 18, 2022


img

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి గత 31 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్ ఎఎస్‌ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఈ తీర్పు చెప్పింది. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడిన ఏజీ పెరరివలన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలనే తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించడానికి బలమైన కారణం ఏమీ లేదు కనుక 31 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివలన్‌ను రాజ్యాంగంలోని సెక్షన్ 142వ అధికరణ ప్రకారం విడుదల చేయాలని ఆదేశిస్తున్నామని తీర్పు చెప్పారు.  

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 1991, మే 21న రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ వచ్చినప్పుడు ఎల్టీటీఈ మద్దతుదారులు ఆయనను హత్య చేశారు. అప్పటికి 19 ఏళ్ళు వయసున్న పెరరివలన్‌ ఈ హత్యకు అవసరమైన  ప్రేలుడు పదార్ధాలను కుట్రదారులకు అందజేసినందుకు 1991, జూన్ 11న అరెస్ట్ చేశారు. 

పెరరివలన్‌ అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1999లో అతనికి మరణశిక్ష పడినప్పటికీ అప్పటి తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల ఒత్తిళ్ళ కారణంగా రద్దయింది. ఆ తరువాత సుప్రీంకోర్టు అతని మరణశిక్షను  జీవిత ఖైదుగా మార్చడంతో పెరరివలన్‌ జైలు శిక్ష అనుభవిస్తూనే విడుదల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తూ చివరికి సాధించాడు. 

శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈ పోరాడినందున తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ రాజీవ్ హంతకులకు బాసటగా నిలుస్తుంటాయి. వాటి మద్దతు, సహకారాలు లభించకపోయుంటే, రాజీవ్ హత్యకు కుట్ర పన్ని జైలు పాలైన వారందరూ మరణశిక్షలను తప్పించుకోగలిగి ఉండేవారే కాదు. 


Related Post