కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మళ్లీ విమర్శలు

May 18, 2022


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రగతిభవన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్దిదారులకు చెల్లింపులు జరుపవలసి ఉండగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుండటాన్ని సిఎం కేసీఆర్ తప్పు పట్టారు.  ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడమేనని అన్నారు. రాష్ట్రాలలో పరిస్థితులు, ప్రజల అవసరాల పట్ల కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువ అవగాహన ఉంటుంది  కనుక ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం ఉంచి నిధులు వాటికే అందజేయాలని సిఎం కేసీఆర్ సూచించారు. 

అయితే కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రాలలో అనేక సంక్షేమ పధకాలు నిర్వహిస్తున్నప్పటికీ టిఆర్ఎస్‌ వంటి ప్రాంతీయ పార్టీలు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నట్లు చెప్పుకుంటూ వాటి క్రెడిట్ సొంతం చేసుకుంటున్నాయి. కేంద్రం నిధులతో అమలవుతున్న పధకాలలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేసుకొంటాయే తప్ప ఎక్కడా ప్రధానమంత్రి ఫోటో కనిపించదు. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలవుతున్న సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి ఆ క్రెడిట్ దక్కనీయకపోగా తిరిగి రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వడం లేదని ఆరోపిస్తుమ్డటం అందరూ వింటూనే ఉన్నారు. 

కనుకనే కేంద్ర ప్రభుత్వం ఈవిధానంలో లబ్దిదారులకు నేరుగా చెల్లిస్తున్నట్లు భావించవచ్చు. అయితే ఈ విధానం ఈరోజు కొత్తగా వచ్చినది కాదు. ఆనాడు  దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయం నుంచే అమలవుతోంది. కనుక దీనిపై సిఎం కేసీఆర్ విమర్శలు రాజకీయంగా టిఆర్ఎస్‌ పార్టీకి ఏమైనా పనికివస్తాయేమో కానీ కేంద్ర ప్రభుత్వం విధానం మారదు.


Related Post