తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే కానీ...

May 18, 2022


img

గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములలో జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలో ఉండి పంటలకు పనికిరాని వాటిని తీసుకొని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అసైన్డ్ భూములను తీసుకొని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. 

అసైన్డ్ భూముల విస్తీర్ణం, వాటి పరిస్థితి (అంటే గుట్టలు, బండరాళ్ళు వంటివి ఉన్నాయా లేదా), అవి ఉండే ప్రదేశం, ఆ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు వివరాలు సేకరించి అసైన్డ్ భూములు కలిగిన రైతులతో మాట్లాడి ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలుసుకొంటున్నారు. 

ఒక ఎకరం (4,840 చదరపు గజాలు) భూమిలో రోడ్లు, కాలువలు వగైరాలకు 50 శాతం పోతుంది కనుక మిగిలిన దానిలో ఎకరానికి 600 గజాలు చొప్పున అభివృద్ధి చేసిన భూమిని రైతులకు తిరిగి ఇస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెపుతున్నారు. దానిలో రైతులు ఇల్లు కట్టుకోవచ్చు లేదా మంచి ధర వస్తే అమ్ముకోవచ్చునని చెపుతున్నారు. 

ఈవిదంగా అసైన్డ్ భూములు సేకరించి అభివృద్ధి చేసినట్లయితే నిరర్ధకంగా పడున్న భూములు ఉపయోగపడతాయి. ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇక రైతులకు ఇవ్వగా మిగిలిన భూములను వేలం వేసినట్లయితే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. 

ఇప్పటికే జిల్లాలో 381.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన అసైన్డ్ భూములను సర్వే చేసి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపించామని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు.    

పనికిరాని అసైన్డ్ భూములను అభివృద్ధి చేసి రైతులు, ప్రభుత్వం లబ్ది పొందాలనుకోవడం చాలా మంచి ఆలోచన. అయితే ఈ వ్యవహారం రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 


Related Post