నిధులిస్తారా లేదా...లేకుంటే పోరాటమే: కేటీఆర్‌

January 22, 2022


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. రాష్ట్రంలో చేనేత క్లస్టర్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాము. కేంద్రం పట్టించుకోలేదు. పీఎం మిత్ర పధకం కింద వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్‌ పార్కుకి రూ.897.92 నిధులు ఇవ్వాలని కోరాము. పట్టించుకోలేదు. సిరిసిల్లాలోని మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకి రూ.993.65 కోట్లు అవసరం కాగా దీనికి ముందుగా రూ.49.84 కోట్లు ఇవ్వాలని కోరాము కానీ కేంద్రం పట్టించుకోలేదు. పోచంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యాండ్లూమ్ ఏర్పాటు చేయాలని కోరాము కేంద్రం పట్టించుకోలేదు. ఈవిదంగా మేము రాష్ట్రం కోసం ఏమి కోరినా...ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మేము సహనం కోల్పోతే రాష్ట్రానికి న్యాయంగా రావలసినవాటి కోసం కేంద్రంతో పోరాటానికి వెనకాడబోము. కనుక ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, బిజెపి ఎంపీల వలన రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారు రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే చేస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయరని అన్నారు. రాష్ట్రం కోసం పనిచేయని బిజెపి ఎంపీలతో ఏవిదంగా వ్యవహరించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 


Related Post