తెలంగాణ సిఎస్, డిజిపిలకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

January 22, 2022


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇటీవల కరీంనగర్‌లో తమ పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేసినప్పుడు, పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించగా, హైకోర్టు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ బండి సంజయ్‌కి బెయిల్‌ మంజూరు చేసింది. 

ఈ ఘటనలపై బండి సంజయ్‌ శుక్రవారం లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ముఖ్య కార్యదర్శికి, డిజిపి మహేందర్ రెడ్డికి, కరీంనగర్‌ సీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, జగిత్యాల డీఎస్పీలకు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన తమ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. 

ఒక ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను, కరోనా ఆంక్షలను ధిక్కరించి దీక్షలు చేయడం బాధ్యతారాహిత్యం అనుకొంటే, తన కార్యాలయంలో తలుపులు వేసుకొని రాత్రిపూట జాగరణ దీక్ష చేస్తున్న ఓ ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడాన్ని కూడా ఎవరూ సమర్ధించలేరు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది. అది ఈవిదంగా వివిద రూపాలలో కొనసాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. 


Related Post