తెలంగాణయే బియ్యం అందించలేకపోతోంది: కేంద్రమంత్రి పీయూష్

December 04, 2021


img

ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో టిఆర్ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని రోజూ నిలదీస్తూనే ఉన్నారు. ఇవాళ్ళ రాజ్యసభలో ఎంపీ కె.కేశవరావు ఇదే విషయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ సమాధానం ఇస్తూ, “టిఆర్ఎస్‌ దీనిపై ఎందుకు రాజకీయాలు చేస్తోందో అర్ధం కావడం లేదు. ఏటా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరణను పెంచుతూనే ఉన్నాము. గత ఏడాది తెలంగాణ నుంచి 94 లక్షల టన్నులు కేంద్రం కొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల టన్నులు ఇస్తామని చెపితే అందుకు అంగీకరించి ఒప్పందం చేసుకొన్నాము. కానీ 4-5 నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇవ్వగలిగింది. ఇంతవరకు మిగిలినది ఇవ్వలేకపోతోంది. ముందు అది సరఫరా చేసిన తరువాత యాసంగి సీజను గురించి మాట్లాడుకొందామని కూడా చెప్పాను. నా ఉద్దేశ్యంలో తెలంగాణ ప్రభుత్వం పంట ఉత్పత్తి లెక్కలను సరిగ్గా నిర్వహించలేకపోతోంది. ఈ సీజనులో ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి బియ్యం తీసుకొనేందుకు మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వచ్చే యాసంగి సీజనులో ఎంత ధాన్యం తీసుకొంటామో ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ మంత్రులు కలిసినప్పుడు చ్లా స్పష్టంగానే చెప్పాను. ఇకపై బాయిల్డ్ రైస్‌ తీసుకోబోమని కూడా స్పష్టంగా చెప్పాను. అయినా సభలో టిఆర్ఎస్‌ ఎంపీలు పదేపదే మళ్ళీ ఇదే అంశం లేవదీస్తున్నారు,” అని అన్నారు.     

తెలంగాణ ప్రభుత్వం మొత్తం కోటి టన్నులు ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. కానీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ తెలంగాణ ప్రభుత్వమే ఒప్పందం ప్రకారం బియ్యం అందించలేకపోతోందని చెపుతున్నారు. ఎవరి వాదనలు వారివే అన్నట్లు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఈవిదంగా కీచులాడుకొంటుంటే మద్యలో రైతులు రోడ్డున పడుతున్నారు. 


Related Post