కుటుంబంలో నలుగురిని బలిగొన్న సొంత ఇంటి కల

December 03, 2021


img

సంగారెడ్డి పట్టణంలో విషాదఘటన జరిగింది. ఆర్ధిక సమస్యల కారణంగా క్రుంగిపోయిన భర్త ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, ఈ విషయం తెలుసుకొన్న అతని భార్య ఇద్దరు పిల్లలతో సహా ఆందోల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది.    

పోలీసుల సమాచారం ప్రకారం... మునిపల్లి మండలంలోని గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ (38) తన భార్య లావణ్య (32), కొడుకు ప్రథమ్ (6), సర్వజ్ఞలతో కలిసి హైదరాబాద్‌, బీహెచ్ఈఎల్ వద్ద నివాసం ఉంటున్నాడు. చంద్రకాంత్ టీఏసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఏవిదంగా చూసినా సుఖంగా జీవిస్తున్నట్లే కానీ సొంత ఇల్లు కల వారి నలుగురి జీవితాలను చిదిమేసింది. 

కొన్ని నెలల క్రితం వారు బీహెచ్ఈఎల్‌కు సమీపంలో బాంబే కాలనీలో ఓ ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. దాని కోసం లావణ్య తల్లితండ్రులు రూ.40 లక్షలు ఆర్ధిక సాయం కూడా చేశారు. అయితే ఇంటి నిర్మాణ ఖర్చులు వారి అంచనాలకు మించిపోవడంతో చంద్రకాంత్ జీతం కూడా దానికే ఖర్చు అయిపోసాగింది. దీంతో వారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోసాగారు. అప్పటికే లావణ్య తల్లితండ్రులు రూ.40 లక్షలు సాయం చేసినందున మళ్ళీ వాళ్ళను అడగలేకపోయారు.

ఈ పరిస్థితులలో చంద్రకాంత్ తన తల్లితండ్రులను సాయం కోరగా వారు నిరాకరించారు. ఈ సందర్భంగా వారి మద్య పెద్ద గొడవ జరిగింది. అది చూసి లావణ్య పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిపోయింది. ఆర్ధిక సమస్యలు, తల్లితండ్రులతో గొడవ, భార్య పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో చంద్రకాంత్ తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. కొంతసేపు తరువాత ఇంటికి వచ్చిన లావణ్య భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి, ఆమె కూడా తీవ్ర మనస్తాపంతో ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని స్థానిక ఆందోల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. 

ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను, పిల్లలను ఎవరూ కాపాడలేకపోయారు. మర్నాడు ఉదయం చెరువులో తేలి ఉన్న వారి శవాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Related Post