గద్వాల్ పర్యటనలో రైతులను పలకరించిన సిఎం కేసీఆర్‌

December 03, 2021


img

సిఎం కేసీఆర్‌ గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించారు. ఆయనకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్ళి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా దారిలో వనపర్తి జిల్లాలో పెబ్బేరు మండలంలోని రంగాపూర్ వద్ద కారు దిగి అక్కడ పొలంలో పనిచేసుకొంటున్న మహేశ్వర్ రెడ్డి, రాములు అనే ఇద్దరు రైతులతో మాట్లాడారు. వారి పొలాలలో సాగుచేస్తున్న మినుము, వేరుశనగ పంటల దిగుబడి, మార్కెట్‌ ధరలు తదితర వివరాలను సిఎం కేసీఆర్‌ వారిని అడిగి తెలుసుకొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసినందుకు సిఎం కేసీఆర్‌ వారిని అభినందించారు. 

తరువాత కొత్తకోట మండలంలోని విలియంకొండ తండాల వద్ద కాన్వాయ్ ఆపించి రోడ్డు పక్కనే ఉన్న కల్లంలో ఆరబోసిన ధాన్యాన్ని చేతిలో తీసుకొని పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న మరో చేనులో వేరుశనగ దుబ్బును తెంచి గింజ పట్టిందా లేదా ఏవిదంగా ఉందని సిఎం కేసీఆర్‌ పరిశీలించారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ రైతులతో మాట్లాడుతూ, యాసంగిలో వరి పండిస్తే కేంద్రప్రభుత్వం కొనదని కనుక ఇదేవిదంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి చేసుకొంటే రైతులు నష్టపోకుండా ఉంటారని, ఆరుతడి పంటలతో భూమికి మళ్ళీ సారం వస్తుందని సిఎం కేసీఆర్‌ వారికి సూచించారు. ఈ సందర్భంగా రైతులు, గిరిజనుల అభ్యర్ధన మేరకు సిఎం కేసీఆర్‌ వారితో ఫోటోలు దిగారు.


Related Post