నేడు టిఆర్ఎస్‌ శాసనమండలి సభ్యుల ప్రమాణస్వీకారం

December 02, 2021


img

ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఆరుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీలలో నేడు ఐదుగురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్, బండా ప్రకాష్, పరుపాటి వెంకట్‌ రాంరెడ్డిలు ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృవీకరణ పత్రాలు అందజేయడంతో, ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం వారిని ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

అయితే వారిలో బండా ప్రకాష్ రాజ్యసభ ఎంపీగా ఉన్నందున ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ దానిని ఆమోదించిన తరువాత ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. 

కనుక మిగిలిన ఐదుగురూ ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనమండలిలో ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 

గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దానిని ఆమోదించకపోవడంతో సిఎం కేసీఆర్‌ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపించి, గవర్నర్‌ కోటాలో మధుసూధనాచారిని ఎంపిక చేశారు. గవర్నర్‌ దానికి ఆమోదం తెలుపడంతో ఈ నెల 6వ తేదీన బండా ప్రకాష్, మధుసూధనాచారి ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. 


Related Post