బిజెపి కార్పొరేటర్లపై కేసులు నమోదు

November 25, 2021


img

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దౌర్జన్యంగా జొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేసినందుకు 32 మంది బిజెపి కార్పొరేటర్లపై అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు బుదవారం కేసులు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి ఫిర్యాదు అందిన తరువాత జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన తరువాత బిజెపి కార్పొరేటర్లే ఈ దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారని నిర్దారించుకొన్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ దాడిని ఖండించడమే కాక దాడికి పాల్పడిన కార్పొరేటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీస్ కమీషనర్‌కు ట్వీట్ చేశారు. బుదవారం ఉదయం టిఆర్ఎస్‌ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని శుభ్రపరిచిన తరువాత పాలతో శుద్ధి చేశారు. దేవాలయం వంటి కార్యాలయంలో బిజెపి కార్పొరేటర్లు గుండాల్లా ప్రవర్తిస్తూ విధ్వంసానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మేయర్ విజయలక్ష్మిని కలిసి ఈ దాడికి పాల్పడిన బిజెపి కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.     

కరోనా కారణంగా ఆరు నెలల క్రితం వర్చువల్ పద్దతిలో జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇప్పుడు కరోనా తీవ్రత పూర్తిగా తగ్గినప్పటికీ పాలకమండలి సమావేశం నిర్వహించడంలేదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగవలసిన అనేక పనులు నిలిచిపోయాయని, నగర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కనుక జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం నిర్వహించాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మేయర్ విజయలక్ష్మి, అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే నిరసన తెలియజేసేందుకు కార్యాలయానికి వస్తే పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని బిజెపి కార్పొరేటర్లు వాదిస్తున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా తమ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.


Related Post