రేవంత్‌ రెడ్డిని కలవడం నేరమా? ఈటల ప్రశ్న

October 23, 2021


img

హుజూరాబాద్‌ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ గోల్కొండ రిసార్టులో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిశారని, కావాలంటే వారివురూ కలిసినట్లు తమ వద్ద ఫోటో ఆధారాలు ఉన్నాయని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దీనిపై ఈటల రాజేందర్‌ వెంటనే స్పందించారు. 

హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అవును నేను రేవంత్‌ రెడ్డిని కలిశాను. అయితే అది ఇప్పటి మాట కాదు. ఐదు నెలల క్రితం నేను నా ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి మాట. అప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలను కలిశాను. అప్పుడే రేవంత్‌ రెడ్డిని కూడా కలిశాను. అయినా రేవంత్‌ రెడ్డిని కలవడం నేరం కాదు కదా?రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ అందరితో మాట్లాడే సంస్కారం కలిగి ఉండాలి. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. నేను టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతలతో మాట్లాడేవాడిని. అవసరమైతే ఇప్పుడూ ఏ పార్టీ నేతలతోనైనా మాట్లాడగలను. ప్రతిపక్షాలంటే నిషేధిత సంస్థలు కావు కదా? నేను 5 నెలల క్రితం రేవంత్‌ రెడ్డిని కలిస్తే అదేదో ఇప్పుడే కలిశానన్నట్లు కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. తద్వారా కాంగ్రెస్‌, బిజెపిల మద్య ఏదో ఉందని ప్రజలలో అనుమానం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌, బిజెపిలు సిద్దాంతపరంగా ఉత్తర దక్షిణదృవాల వంటివని, అవెన్నటికీ కలవవని అందరికీ తెలుసు,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.


Related Post