ఇప్పుడు కోతలు ఉండవు కానీ భవిష్యత్‌లో ఉండొచ్చు: జగదీష్ రెడ్డి

October 12, 2021


img

సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ తప్పక గొప్పగా చెప్పుకొనే విషయం తెలంగాణలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండటం! అయితే ఇప్పుడు బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, దాంతో పలు రాష్ట్రాలలో మళ్ళీ విద్యుత్ కోతలు మొదలవడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణలో విద్యుత్ కొత్తలకు ఆస్కారమే లేదు. మరో రెండు వందల ఏళ్ళకు సరిపడా రాష్ట్రంలో బొగ్గు గనులున్నాయి కనుక బొగ్గు కొరత కూడా లేదు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను రాజధాని హైదరాబాద్‌కు మళ్ళీ అక్కడ మిగిలిన విద్యుత్‌ను జిల్లాలకు పంపిణీ చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాము. ఇక రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా బాగానే ఉంది. కనుక రాష్ట్రంలో కనురెప్పపాటు కూడా విద్యుత్ పోయే అవకాశమే లేదు. కానీ కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, చట్టలతో భవిష్యత్‌లో రాష్ట్రంలో కూడా విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సంస్థలను వదిలించుకొని ప్రైవేటీకరణ చేయడం కోసం బొగ్గుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో హటాత్తుగా విద్యుత్ కష్టాలు మొదలవడం చూస్తే అవి నిజమే అనిపిస్తోంది,” అని అన్నారు.    Related Post