తెలంగాణ శాసనసభలో కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఏర్పాటు

September 25, 2021


img

తెలంగాణ శాసనసభలో కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నిర్మించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా కొత్తగా ఎన్నికైనవారికి శిక్షణా తరగతులు, సభా నిర్వహణకు సంబందించి చర్చలు, సెమినార్లు నిర్వహించవచ్చని సిఎం కేసీఆర్‌ తెలిపారు. తద్వారా కొత్తగా ఎన్నికైన సభ్యులకు విషయ పరిజ్ఞానం పెరిగి సభలో అర్దవంతమైన చర్చలు చేయగలరని సిఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభ అంటే కుస్తీ పోటీలకు వేదిక కాదని అర్ధవంతమైన చర్చలకు వేదిక కావాలని అన్నారు. తెలంగాణ శాసనసభ దేశంలోనే అత్యుత్తమైనదిగా నిలవాలని కోరుకొంటున్నానని అన్నారు.

సభలో ఏదైనా అంశంపై లోతుగా అర్ధవంతమైన చర్చలు జరిగినప్పుడు దానిని సూచించే విదంగా ప్రత్యేకంగా ఓ పేరు పెట్టాలని, తద్వారా సులువుగా దాని గురించి అందరూ తెలుసుకోగలుగుతారని సిఎం కేసీఆర్‌ శాసనసభ అధికారులకు సూచించారు.

సమావేశాలలో విధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, వాయిదా తీర్మానాలు, ప్రోటోకాల్ వంటి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులు సూచించిన అంశాలపై కూడా సమావేశాలలో చర్చ జరిగేలా చూడాలని అన్నారు. అలాగే బడ్జెట్‌ సమావేశాలలో ప్రతీ శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నిర్మాణంపై నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ తెలిపారు.


Related Post