ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

September 18, 2021


img

ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతాయని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి టుంది. ఈనెల 25తో ఆరు నెలలు పూర్తవుతాయి. కనుక ఒకరోజు ముందుగా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు తెలియజేయగా ఆమె ఆమోదం తెలిపారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? సమావేశాలలో ఏయే అంశాలు (అజెండా) చర్చించాలనే వాటిపై ఆరోజు బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటారు. 

ఈసారి సమావేశాలలో దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పాల్గొంటారు. కనుక ప్రజాసమస్యలపై ఆయన టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. ఈ సమావేశాలలో ప్రధానంగా దళిత బంధు పధకం, హుజూరాబాద్‌ ఉపఎన్నికలపై అధికార ప్రతిపక్షాల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగవచ్చు. అలాగే వచ్చే యాసంగి సీజనులో రాష్ట్రంలో దుడ్డు బియ్యం పండించవద్దనే ప్రభుత్వం సూచనపై కూడా వాదోపవాదాలు జరుగవచ్చు. కనుక ఈసారి శాసనసభ సమావేశాలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.


Related Post