తెలంగాణ రైతులకు ప్రత్యామ్నాయ పంటలే మేలు: కేటీఆర్‌

September 18, 2021


img

కేంద్రప్రభుత్వం వద్ద మరో 5 ఏళ్ళకు సరిపడా దుడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తెలంగాణ నుంచి ఇక బియ్యం కొనుగోలు చేయలేమని చెప్పింది. కనుక వచ్చే యాసంగిలో రాష్ట్రంలో రైతులు దుడ్డు బియ్యం వేయవద్దని దానికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. 

ఇటువంటి సమయంలో రూ.887 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో మూడు జూట్ మిల్లులు స్థాపించేందుకు మూడు సంస్థలు రావడం తెలంగాణ రైతుల అదృష్టమే అని చెప్పాలి. కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్లా జిల్లాలో ఈ జూట్ మిల్లులు ఏర్పాటు కాబోతున్నాయి. త్వరలో నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కూడా జూట్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “వరిసాగుతో మున్ముందు రైతులకు అనేక సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది కనుక రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో జనుము పండించే రైతులకు ప్రభుత్వం తరపున అన్నివిదాలా సహాయసహకారాలు అందజేసి ప్రోత్సహిస్తాము. కొత్తగా ఏర్పాటవుతున్న ఈ జూట్ మిల్లులు రాష్ట్రంలో పండే జనుము పంటకు మంచి ధర లభించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక రాష్ట్రంలో రైతులు జనుము పండించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇతర పంట ఉత్పత్తుల కోసం కూడా 10 వేల ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 


Related Post